ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు తనవల్లే ఆస్కార్ వచ్చిందని అన్నారు అజయ్ దేవ్‌గణ్. అంత మాట ఎలా అనేశారు అని సౌత్ వాళ్లు కంగారు పడుతుంటే, నార్త్ వాళ్లు మాత్రం చిల్ బ్రో అంటూ నవ్వేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ఆర్ఆర్ఆర్. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఆ సన్నివేశాల్లో కూడా ఎక్కడా కనిపించలేదు అజయ్ దేవ్‌గణ్. అలాంటప్పుడు తన వల్లే ఆస్కార్ వచ్చిందని ఎలా అంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు విషయం తెలియని వారు.
నిజానికి, అజయ్ దేవ్‌గణ్ నటించిన భోళా సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. తమిళంలో విడుదలైన ఖైదీకి రీమేక్ ఇది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు అజయ్ దేవ్‌గణ్. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చింది. మీరు కూడా ఆ సినిమాలో భాగస్వామ్యమయ్యారు. ఎలా అనిపిస్తోంది అంటూ ప్రశ్న ఎదురైంది. ఆస్కార్ తనవల్లే వచ్చిందంటూ చమత్కరించారు అజయ్ దేవ్‌గణ్. నాటు నాటు పాటకు తాను స్టెప్పులేసి ఉంటే ఏం జరిగి ఉండేదో తెలుసుకదా అంటూ అందరిలోనూ నవ్వులు పూయించారు.
తన సినిమా భోళా మీద హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అజయ్. టబుతోనూ ఆయన యాక్షన్ చేయించారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సినిమాకు అంతర్జాతీయంగా 20 వేదికల మీద అవార్డులు వచ్చినట్టు ప్రకటించింది టీమ్. హెచ్‌సీఏ అవార్డు, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్, జపాన్ ఇంటర్నేషనల్ అవార్డులతో పాటు తమ సినిమాకు వచ్చిన అన్ని అవార్డుల లిస్టును ప్రకటించింది టీమ్. ఆస్కార్‌కి వెళ్లొచ్చిన శుభసందర్భాన ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించి చెప్పమని అడుగుతున్నారు ఫ్యాన్స్.